వై.ఎస్.ఎస్. చెన్నై ఏకాంత ధ్యాన వాసం ఒక వై.ఎస్.ఎస్. ఆశ్రమ స్థాయికి పెంచబడింది

15 సెప్టెంబర్, 2024

సెప్టెంబర్ 15, 2024న, సాధనా సంగమం ముగింపు కార్యక్రమం సందర్భంగా ప్రత్యక్ష ప్రసారం చేయబడిన ఒక సత్సంగంలో యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక అధిపతి అయిన స్వామి చిదానంద గిరి గారు, వై.ఎస్.ఎస్. చెన్నై ఏకాంత ధ్యాన వాసం ఇక వై.ఎస్‌.ఎస్. ఆశ్రమంగా పేర్కొనబడుతుందని, మరియు రాబోయే సంవత్సరాల్లో ఒక పూర్తి స్థాయి ఆశ్రమంగా అభివృద్ధి చేయబడుతుందని లాంఛనంగా ప్రకటించారని ఎంతో సంతోషంతో మీకు మేము తెలియజేస్తున్నాం.

స్వామి చిదానందగారు చేసిన ఈ ప్రత్యేక ప్రకటనను ఈ క్రింద చూడండి.

Play Video

ఒక ఆధ్యాత్మిక జలాశయం (oasis)

వై.ఎస్.ఎస్. భక్తులకు ఒక ఏకాంత ధ్యాన వాస కేంద్రంగా సేవలందించేందుకు చెన్నై నగరం మధ్యభాగం నుండి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ 17 ఎకరాల ఆధ్యాత్మిక జలాశయం (oasis) 2010లో ప్రారంభించబడింది. ఒక సరస్సు మరియు రిజర్వ్ ఫారెస్ట్ మధ్య ఉన్న ఈ కేంద్రం, నిశ్శబ్దత, ఏకాంతం మరియు ప్రశాంతతకు నెలవైన ఒక ఆదర్శ మందిరంగా నిలుస్తుంది.

నాలుగు వై.ఎస్.ఎస్. ఆశ్రమాలన్నీ ఉత్తర మరియు తూర్పు భారతదేశంలో ఉన్నందున, దక్షిణ భారతదేశానికి చెందిన భక్తులు వాటిని సందర్శించడానికి మరియు సన్యాసులతో సంభాషించి ప్రయోజనం పొందడానికి చాలా దూరం ప్రయాణించాల్సి వచ్చేది. దక్షిణాదిలో పెరుగుతున్న భక్తుల (తమిళం మరియు తెలుగులో విడుదల చేసిన వై.ఎస్.ఎస్ పాఠాలు కొంతవరకు కారణం) అవసరాలు తీర్చేందుకు ఫిబ్రవరి 2024 నుండి చెన్నై ఏకాంత ధ్యాన వాసంలో నిరంతర ప్రాతిపదికన సన్యాసులను ఉంచాలని వై.ఎస్.ఎస్. నిర్ణయించింది. ఇలా నిరంతరం సన్యాసులు ఉండడం వలన భక్తులకు గణనీయంగా ప్రయోజనం కలిగింది, ఇంగ్లీష్, తమిళం, తెలుగు మరియు కన్నడంలో నిర్వహించిన సాధనా సంగమాలు, ఏకాంత ధ్యాన వాసాలు మరియు అందరికీ వ్యాప్తి చేసే కార్యక్రమాలలో భక్తులు అధికంగా పాల్గొనడానికి ఇది దారితీసింది. ఈ పురోగతితో ఉత్తేజితులైన స్వామి చిదానందగారు, ఇప్పటి నుండి ఏకాంత ధ్యాన వాసం ఒక వై.ఎస్.ఎస్. ఆశ్రమంగా పిలువబడుతుందని అధికారికంగా ప్రకటించారు.

వ్యక్తిగత ఏకాంత ధ్యాన వాసాలు మరియు రాబోవు కార్యక్రమాలలో మాతో కలిసి పాల్గొనండి

చెన్నైలోని మా క్రొత్త ఆశ్రమాన్ని సందర్శించమని మేము మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము, ఇక్కడ ఉన్న ఆహ్లాదకరమైన సహజ పరిసరాలు, ఆధ్యాత్మిక పురోగతి కోసం కావలసిన ఉత్తేజకరమైన వాతావరణాన్ని పెంపొందిస్తాయి. ఇక్కడ, మీరు గాఢమైన సాధనలో మునిగిపోవచ్చు, మీలో పరివర్తన తెచ్చే ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనవచ్చు మరియు ఈ పావన మందిరం యొక్క శాంతి మరియు ప్రశాంతతను అనుభవించవచ్చు.

ఈ ప్రయాణంలో తదుపరి దశలు

మేము ప్రస్తుతం భవనశిల్పులతో కలిసి బృహత్ప్రణాళిక రూపొందించడానికి కృషి చేస్తున్నాము, ఈ ప్రణాళికతో ఆశ్రమం పూర్తిస్థాయిలో పనిచేసేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఉంటాయి. అయినప్పటికీ, ప్రణాళికను ఖరారు చేయడానికి మరియు ఈ సౌకర్యాల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి కొంత సమయం పడుతుంది, మరియు భవిష్యత్తులో అనేక సంవత్సరాలపాటు ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని మేము భావిస్తున్నాము.

ఈ సమయంలో, పెరుగుతున్న వై.ఎస్.ఎస్. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటున్న భక్తుల సంఖ్య వలన ఈ ఏకాంత ధ్యాన వాసం, స్థల పరిమితులను ఎదుర్కొంటోంది. వీటిలో సన్యాసులు మరియు సేవకుల కోసం గదులు మరియు సౌకర్యాల కొరత, భక్తులకు పరిమితమైన వ్యక్తిగత వసతులు మరియు కార్యాలయానికి సరిపోని స్థలం ఉన్నాయి.

ఈ సవాళ్లను వెంటనే పరిష్కరించడం కోసం, సందర్శకులు, భక్తులు, సేవకులు మరియు సన్యాసుల అవసరాలను తీర్చేందుకు ఇప్పటికే ఉన్న సౌకర్యాలను మేము నవీకరిస్తున్నాము. మరింత గోప్యత కోసం స్నానపు గదులతో కూడిన అతిథి గదులుగా డార్మీటరీలను మార్చడం, భక్తులయిన పురుషులకు, స్త్రీలకు అదనపు గదులను నిర్మించడం, సన్యాసులు మరియు సేవకులు నివసించేందుకు మరియు పని చేసేందుకు అదనపు కార్యాలయం మరియు స్వాగత భవనంతో కూడిన ప్రత్యేక ప్రాంతాలను నిర్మించడం వీటిలో ఉన్నాయి.

మీ సహాయం మరియు మద్దతు ప్రశంసించబడుతుంది

మేము ఈ ఆధ్యాత్మిక స్వర్గధామాన్ని అభివృద్ధి చేయడం మరియు విస్తరించడమనే కార్యం కొనసాగిస్తున్నప్పుడు, మీ ప్రార్థనలతో, స్వచ్ఛంద సేవతో మీ తోడ్పాటును మరియు సేవా కార్యకలాపాల్లో మీ చురుకైన భాగస్వామ్యాన్ని మేము కోరుకుంటున్నాము. మీ ఉదారమైన సహాయం, ఈ ఆశ్రమాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషించి, అందరికీ ఆధ్యాత్మిక పునరుజ్జీవనం కలిగించే శక్తివంతమైన కేంద్రంగా వికసించేందుకు సహాయం చేస్తుంది.

విచారణల కోసం, లేదా మమ్మల్ని సంప్రదించడానికి, దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి.

దేవుడు మరియు గురువులు మిమ్మల్ని ఆశీర్వదించి, మీకు ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేయుగాక.

ఇతరులతో పంచుకోండి