“గురువు మేలుకొన్న భగవంతుడు, శిష్యునిలో నిద్రిస్తున్న భగవంతుణ్ణి మేల్కొలుపుతాడు….మానవులందరిలో, ఉత్తమ దాత గురువు. పరమాత్మునిలా, అతని దాతృత్వానికి హద్దులు లేవు.”
— శ్రీ శ్రీ పరమహంస యోగానంద
ప్రియమైన దివ్యాత్మా,
భారతదేశంలోని గురుదేవుల ఆశ్రమాల నుంచి మీకు హార్దిక శుభాకాంక్షలు! గురుపూర్ణిమ (జూలై 21) అనే పవిత్రదినం సమీపిస్తూ ఉంటే మన హృదయాలు గురుదేవులు, యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థాపకులు అయిన శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారికి, వై.ఎస్.ఎస్. గురుపరంపరకి ఆత్మ నివాళులు అర్పిస్తాయి. మన మాయాధీనమైన మానవ ప్రకృతిని భగవంతునిలో అపరిమితమైన స్వాతంత్ర్యం వైపు నడిపించగలిగే, భగవంతునితో ఏకమైన వారైన ఒక గురువుకు ఆకర్షించబడడం కంటే ఆధ్యాత్మిక మార్గంలో గొప్ప కానుక మరొకటి లేదు.
గురువు తమకు అనుగ్రహించిన ఆధ్యాత్మిక నిధుల వల్ల పెల్లుబికే కృతజ్ఞత వల్లనూ, తమ భక్తిని వ్యక్తపరచడానికీ యోగదా భక్తులు భారతదేశంలో పరమహంసజీ బోధనల స్వరూపమూ, వాటి వాహిక అయిన వై.ఎస్.ఎస్. సంస్థకు చేయూత నందించేందుకు అవకాశాలను వెదుక్కుంటూ తరచుగా మా వద్దకు వస్తూ ఉంటారు. ఇటీవలి నెలలలో చేపట్టిన ప్రధాన నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేయడం కోసం మాకు భక్తుల ఆర్థికపరమైన తోడ్పాటు అవసరమైన అటువంటి అనేక అవకాశాల గురించి మేము ఈ సందేశంలో మీతో పంచుకుంటున్నాము.
- వై.ఎస్.ఎస్. దక్షిణేశ్వర్ ఆశ్రమ ప్రాంగణాన్ని విస్తరింప జేయడమూ, అతిధుల కోసం అక్కడ ఉన్న వసతులను మెరుగుపరచడం
- శరవేగంతో పెరుతుగుతున్న వై.ఎస్.ఎస్. సంస్థ అవసరాలను తీర్చడానికి ప్రతిభావంతులైన భక్తులకు ఉపాధి కల్పించడం
- వై.ఎస్.ఎస్. రాంచీ ఆశ్రమంలో పునర్నిర్మాణ కార్యక్రమాలు
ఈ నిర్మాణ ప్రాజెక్టుల అంచనా వ్యయం ₹10 కోట్లు.
సమకాలీన ప్రమాణాలను చేరుకోడానికి మన ఆశ్రమంలోని సదుపాయాలను మెరుగుపరుస్తూనే వై.ఎస్.ఎస్. ఆశ్రమాల ముఖ్యలక్షణమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని పరిరక్షించడానికి మేము కృషి చేశాము. అందువలన భక్తులు గతంలో వలెనే అదేవిధమైన అద్భుతమైన అనుభవాన్ని పొందుతూనే ఉండగలరని ఖాయపరుచుకున్నాము. మన ఆశ్రమాలను సందర్శించి ఈ కొత్త సౌకర్యాలను ఉపయోగించుకోమని, దైవానుసంధానంలో, ఆధ్యాత్మిక అధ్యయనంలో సమయం గడుపుతూ తత్ఫలితంగా ఈ పవిత్రమైన వాతావరణంలో మిమ్మల్ని మీరు పునరుద్ధరించుకోమని, చైతన్యం నింపుకోమని మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము.
వేల మంది ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికై వచ్చే ఈ పవిత్ర స్థలాలను తయారు చేయడంలో కొత్తరూపు ఇవ్వడంలో విరాళాల ద్వారా, సేవ లేదా ప్రార్థనల ద్వారా మీరు అందిస్తున్న తోడ్పాటుకు మేము గాఢంగా కృతజ్ఞతలు తెలుపుచున్నాము. కలిసి భగవంతుడిని అన్వేషించడంలో ఐక్యతతో ఉన్న గురూజీ ప్రపంచవ్యాప్త కుటుంబంలో మీరు భాగమవడం మాకు గౌరవప్రదం.
శ్రీ శ్రీ పరమహంస యోగానందుల వారు చెప్పారు, “ఈ సంస్థాగత కార్యంలో ఆసక్తి గల వారందరినీ నేను వ్యక్తిగతంగా సంరక్షిస్తానని మీరందరూ తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. నేను మిమ్మల్ని నా వ్యక్తిగత ప్రేమ యొక్క సంరక్షణలో ఉంచుతున్నాను. ఈ లోకంలో, పై లోకాలలో మీ కార్యక్రమాలు కొనసాగించడానికి నా శాయశక్తులా సహాయం చేస్తాను.”
ఈ గురుపూర్ణిమ దినాన గురుదేవుల దివ్యప్రేమ వెలుగులు మీ జీవితాన్ని సమృద్ధిగా నింపును గాక. జై గురు!
దివ్య స్నేహంలో,
యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా
దిగువ పూర్తి అభ్యర్థనని చదవండి:
పావన గంగానదీ తీరాన ఉన్న ఈ పవిత్ర ఆశ్రమాన్ని గురూజీ ఉన్న కాలంలోనే సంపాదించారు. అప్పట్నుంచీ ఇది వేలవేల భక్తులకు ఒక ఆధ్యాత్మిక ఆశ్రయస్థానంగా మారింది. ప్రతిరోజూ స్వాంతన కోరుతూ దీనిని సందర్శించే ఎప్పటికీ పెరుగుతున్న సందర్శకులకు వసతి కల్పించడానికి పక్కనే ఉన్న భూమిని కొని ఉన్నదాన్ని విస్తరింపజేయడమూ, ఆధునిక ప్రమాణాలకు తగినట్టుగా అతిథిగృహ వసతులను మెరుగుపరచడమూ చేద్దామని మేము ప్రణాళిక వేస్తున్నాము.
అతిథి గృహాలను మెరుగుపరచడం: అతిథి గృహంలోని గదులన్నిటినీ పూర్తిగా కొత్తవిగా తయారు చేయడం జరిగింది. వాటిలో ఇప్పుడు మంచాలు, పరుపులు, కర్టెన్లు, రగ్గులు, బాత్రూమ్ లో కొళాయిలు, ఫర్నిచర్ పూర్తిగా కొత్త వాటిని అమర్చారు. వేసవి నెలలలో కూడా సౌకర్యవంతంగా ఉండేందుకు వీలుగా గదులలో ఏ.సి లను అమర్చారు. అతిథి గృహంలోని వరండాలలో కొత్త టైల్సు వేయడంతోపాటు మొత్తం భవనమంతా తిరిగి రంగులు వేశారు.
వంటగది, భోజన సదుపాయాలను ఆధునికీకరించడం: ప్రధాన వంటశాల మరింత మెరుగైన డిజైన్ తో, కొత్త స్టవ్ లు, పరిశుభ్రమైన, సమర్థవంతమైన పరిసరాల కోసం మరింత ప్రకాశాన్నిచ్చే లైట్లతో మెరుగుపర్చారు. ఆశ్రమంలో ఉండడానికి వచ్చే, ఆదివారం సత్సంగం లేదా వారమంతా సందర్శించే భక్తుల సంఖ్య పెరుగుతూ ఉండడం వలన వారికి వసతి కల్పించడానికి భోజనశాల రెండు అంతస్తులతో విస్తరించబడింది, కొత్త టేబుళ్ళు, కుర్చీలతో పూర్తిగా నవీకరించబడింది.
వీటిని మెచ్చుకుంటూ భక్తులు ఎన్నో యోగ్యతా పత్రాలను పంపిస్తూ ఉన్నారు. వాటిలోవి రెండు ఇవి:
“ఇటీవల నేను దక్షిణేశ్వరంలో ఉన్నాను. నేను ఆశ్రమంలో ప్రవేశించగానే అక్కడ ప్రశాంతత ప్రత్యక్షంగా తెలుస్తోంది. వసతి గదుల లోపల, చూట్టూరా ఉన్న పరిశుభ్రత చాలా ఉన్నత ప్రమాణాల్లో ఉంది. కొత్తగా తయారుచేసిన వంటశాల ఏ లోపాలు లేకుండా చాలా చక్కగా అమర్చబడి ఉంది. అక్కడి ప్రశాంత వాతావరణము, చక్కని ఆతిథ్యము నా సందర్శనను సుసంపన్నం చేశాయి.” — ఎస్. సి., యు. పి.
“అతిథి గృహంలో నవీకరించబడిన గదులు చాలా సౌకర్యవంతంగా ఉన్నాయి, మంచి అభిరుచితో చేయబడ్డాయి. నేను ఏప్రిల్లో మంచి ఎండాకాలంలో దక్షిణేశ్వరం వెళ్ళాను. అయినా అద్భుతంగా ధ్యానాలు చేయగలిగాను. ఏ.సి గదులకు ధన్యవాదాలు — నేను వేడి ఏమాత్రమూ అనుభవించ లేదు.” — హెచ్. కె., డబ్లు. బి.
పవిత్ర స్థలాలను విస్తరించడం: ఆదివారం సత్సంగాలు, ప్రత్యేక స్మారకదినాలు, ఇతర ప్రత్యేక కార్యక్రమాల రోజుల్లో వచ్చే అనేకమంది భక్తులకు వసతి కల్పించడానికి ఇప్పుడున్న ధ్యానమందిరం చాలా చిన్నది. తాత్కాలిక పరిష్కారంగా ప్రధాన భవనం యొక్క వరండాను ఏ.సిలు పెట్టి, దట్టమైన నీలిరంగు తెరలతో ధ్యానమందిరంగా మార్చాము. ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ ఏర్పాటు సరిపోదని రుజువవుతుంది.
పెరుగుతున్న భక్త సమూహానికి వసతి కల్పించడానికి ఒక పెద్ద ధ్యానమందిరం యొక్క అవసరం ఉందని చెప్పనవసరం లేదు.
భగవంతుడు, గురుదేవుల కృపతో దక్షిణేశ్వర్ ఆశ్రమానికి పక్కనే (ఆశ్రమ వసతి గృహానికి ఉత్తరాన) ఉన్న రెండు ఫ్లాట్ల జాగా అమ్మకానికి రాగా, వై.ఎస్.ఎస్. వాటిని ఇప్పుడు కొన్నది. వై.ఎస్.ఎస్. తన సౌకర్యాలను విస్తరింప జేసుకోడానికి, ఎప్పటికీ పెరుగుతున్న దక్షిణేశ్వర్ ఆశ్రమ అతిధులు, సందర్శకులకు వసతి కల్పించడానికి ఒక పెద్ద ధ్యానమందిరం కట్టడానికి ఈ కొనుగోళ్లు సహాయం చేస్తాయి.
ఇటీవలి సంవత్సరాలలో వై.ఎస్.ఎస్. భక్తులను ఉద్యోగులుగా నమోదు చేసుకోవడంలో ఇంతకు ముందెన్నడూ లేని పెరుగుదలను చూసింది. కలకాలం నిలిచే గురుదేవుల బోధల ఆకర్షణకు సాక్ష్యం ఇది. అదనంగా ప్రస్తుత డిజిటల్ యుగం, ఆర్థిక వ్యవహారాలు, పుస్తకాలు, పాఠాల పంపిణీ, భక్తుల ఉత్తర ప్రత్యుత్తరాలు, వెబ్ డిజైన్, సోషల్ మీడియా వంటి అనేక విభాగాలను డిజిటల్ గా మార్చి స్వయంచాలితంగా చేయమని నిర్బంధిస్తోంది. విస్తరిస్తున్న భక్త కుటుంబానికి సమర్థవంతంగా సేవలందించడానికి, శరవేగంతో మారుతున్న మన చుట్టూ ఉన్న ప్రపంచంతో వేగాన్ని కొనసాగించడానికి మేము అనేక వినూత్న డిజిటల్ వేదికలను అందిస్తున్నాము. వాటి ద్వారా గురుదేవుల యొక్కజీవితాన్ని మార్చి వేసే బోధనలను అందుకుని లబ్ధి పొందడం ప్రతి ఒక్కరికీ మరింత సులువవుతుంది.
ఈ పెరుగుదలతో పాటు ప్రభుత్వం యొక్క నియంత్రణ మరియు సమ్మతి అవసరాలు కూడా పెరిగాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించడం, ప్రసంగాలు చేయడం, సలహాలు అందించడంపైనా ప్రధానంగా దృష్టి పెట్టే మన సన్యాసులకు, పెరుగుతున్న ఈ కార్యాచరణ అవసరాలను తట్టుకోడం పెద్ద సవాలుగా మారింది.
ఈ అవసరాలను తీర్చడానికి, పెరుగుతున్న సభ్యుల ఆధ్యాత్మిక అవసరాలపై దృష్టి పెట్టడానికి మన సన్యాసులకు స్వేచ్ఛనివ్వడానికి వై.ఎస్.ఎస్. ఈ మధ్య కాలంలో మన భక్తసంఘాల నుంచి ప్రతిభావంతులైన వృత్తి నిపుణులను ఉద్యోగులుగా నియమించింది. అంకితభావం గల ఈ వ్యక్తులు దిగువ ఇచ్చినవి కలుపుకుని అనేక విభాగాల్లో పని చేస్తున్నారు:
- ఐ.టి వృత్తి నిపుణులు: గురుదేవుల బోధలను డిజిటల్ గా వ్యాప్తి చేయడానికి ముందడుగు వేస్తున్నారు
- వైద్యులు: మన ఉచిత వైద్యశాలలలో సేవలందిస్తున్నారు
- చార్టర్డ్ అకౌంటెంట్లు: మన ఆర్థిక సమగ్రతకు, సమ్మతికి భరోసాను ఇస్తున్నారు
- సంస్థాపరమైన అభివృద్ధి నిపుణులు: మన ఆంతరంగిక కార్యక్రమాలను మెరుగుపరచడం, క్రమబద్ధీకరించడం.
- ఇతర ముఖ్యోద్యోగులు: వివిధ క్లిష్టమైన విధులకు మద్దత్తు నివ్వడం.
అదృష్టవశాత్తూ, ఈ భక్తులు తమ తమ విభాగాలలో నిష్ణాతులవడమే కాక తమ పనుల్లో గురుదేవుల స్ఫూర్తి మూర్తీభవించేలా చేస్తున్నారు. మన కార్యాచరణ సామర్థ్యాన్ని విస్తరింప జేసుకోడంతో పాటు మన ప్రధాన కార్యం యొక్క సారాన్ని కూడా మనం నిలబెట్టుకునేలా ఖాయపరుస్తున్నారు.
అంతే కాకుండా, ఇటీవలి ప్రభుత్వ ప్రకటనలు తోటమాలులు, వంట మనుషులు, ఇతర ఉద్యోగులు వంటి నైపుణ్యం లేని లేదా పాక్షిక నైపుణ్యం గల కార్మికుల కనీస వేతనాలను గణనీయంగా పెంచివేశాయి. ఈ మార్పులు, వృత్తి నిపుణుల నియామకం రెండూ కలిసి మనం సంవత్సరానికి ఇచ్చే జీతాల పద్దును 2 కోట్లు పైగా పెంచేశాయి.
జన్మోత్సవ్ సందర్భంగా మా మునుపటి వార్తాసంచికలో ఆధ్యాత్మిక ఎదుగుదలకు, పునరుజ్జీవనానికి అనుకూలమైన వాతావరణాన్ని తయారు చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్న అనేక ముఖ్యమైన పునర్నిర్మాణ కార్యక్రమాల గురించిన సమాచారాన్ని మేము మీతో పంచుకున్నాము. మొదలుపెట్టిన ఈ పనులలో మేము చెప్పుకోదగిన ప్రగతి సాధించామని చెప్పడానికి మేము ఆనందిస్తున్నాము:
- అతిథిగృహం మెరుగుపరచడం: ప్రధాన అతిథిగృహం, స్త్రీల అతిథి గృహములలో పనులు చివరికి వచ్చాయి, ఈ సౌకర్యాలు అక్టోబరు 2024 నాటికి పూర్తిగా వినియోగంలోకి రాగలవని మేము ఆశిస్తున్నాము. ఈ పునర్నిర్మాణాలలో వసతిగృహాలను వ్యక్తిగత/కుటుంబ గదులుగా మార్చడం, పాడైన భాగాలకు మరమ్మత్తులు చేయించడం, మన వసతి సామర్థ్యాన్ని పెంచడానికి స్త్రీల అతిథి గృహం పైన ఇంకొక అంతస్తును వేయడం మొదలైనవి ఉన్నాయి.
- ఆడిటోరియం పునర్నిర్మాణం: 1100 మంది కూర్చోగలిగే ఆడిటోరియం పని విశేషమైన వేగంతో జరుగుతోంది. జనవరి 2025 మొదట్లో పూర్తవుతుందని ఆశిస్తున్నాము. పైకప్పును వేడిని చొరనివ్వని కొత్త షీట్లతో తిరిగి నిర్మించడం, అత్యాధునిక ఆడియో వీడియో పరికరాలను ఏర్పాటు చేయడం, ఏ.సి లను ఏర్పాటు చేయడం మొదలైనవి ఈ సమగ్ర పునర్నిర్మాణంలో ఉన్నాయి.
అనుబంధ నిర్మాణ కార్యక్రమాలు: పై నిర్మాణ కార్యక్రమాలతోపాటు ఆశ్రమంలోని అనేక పాతకట్టడాల పునర్నిర్మాణానికి మేము పూనుకున్నాము. అవి ఏవంటే:
- మైదానంలోని పాత చిన్నగదులు (సంగం సమయాల్లో రిసెప్షన్ కు, రిజిస్ట్రేషన్ కు ఉపయోగించినవి)
- ఆడిటోరియమ్ వద్ద నున్న మరుగుదొడ్లు
- ఉద్యోగుల నివాస గృహాలు, సామాన్లు భద్రపరచే ప్రాంతాలు
పునర్నిర్మించబడిన ఆడిటోరియమ్, అదనంగా నిర్మించిన అతిథిగృహాలు మన విద్యుత్తు సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం కలుగజేశాయి. దాని వల్ల ఒక కొత్త 50 కిలోవాట్ల ట్రాన్స్ ఫార్మర్, 125 కె వి ఎ డిజిసెట్ ను ఏర్పాటు చేయవలసి వచ్చింది.
ఆర్థిక అవలోకనం, భవిష్య అవసరాలు: రాంచీ ఆశ్రమంలో ఈ పునర్నిర్మాణాలన్నింటికీ, ఉదారంగా మీరు ఇచ్చిన విరాళాలను మేము ఇప్పటికే అందుకున్నాము. ఈ ముఖ్యమైన పునర్నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేయడానికి ఇంకా 4 కోట్లు అవసరమౌతుంది. మీ సహాయానికి మేము చాలా కృతజ్ఞులము. త్వరలోనే మెరుగుపరచబడిన ఈ సౌకర్యాలకు మిమ్మల్ని ఆహ్వానించడానికి మేము ఎదురు చూస్తున్నాము.
గురుదేవుల నిర్దిష్ట లక్ష్యాలకు మీ అచంచల మద్దతు మరియు అంకితభావాన్ని మేము ఎంతగానో అభినందిస్తున్నాము. మీ సహాయంతో, రాంచీ మరియు దక్షిణేశ్వర్ ఆశ్రమాలలో సౌకర్యాలను మెరుగుపరచడానికి అవసరమైన ₹ 10 కోట్లను పొందగలమని మరియు మన నిరంతర పురోగతికి మద్దతుగా అంకితభావంతో పనిచేసే ఉద్యోగులను నియమించుకోగలమని మేము ఆశిస్తున్నాము.
మా ప్రార్థనలు మరియు స్నేహం ఎల్లప్పుడూ మీతో ఉంటాయి.