నన్ను వారి ప్రియతమునిగా భావించి ధ్యానిస్తూ, ఎడతెగని భక్తి భావనతో నాలో ఐక్యమయ్యే వారి యోగక్షేమములు నేను వహిస్తాను — వారి లోటుపాట్లను భర్తీ చేసి, వారికి ప్రాప్తించే వాటిని శాశ్వతము చేస్తాను.
—గాడ్ టాక్స్ విత్ అర్జున: ద భగవద్గీత (IX:22)
ప్రియతములారా,
మనందరి ప్రియతముడైన శ్రీకృష్ణ పరమాత్మ జన్మదినమైన పవిత్ర జన్మాష్టమి సందర్భంలో మీకు ప్రేమపూరిత శుభాకాంక్షలు. దివ్య ప్రేమ స్వరూపుడైన ఈ అవతార శ్రేష్ఠుని జన్మదినోత్సవాన్ని భక్తితో ఆనందోత్సవంగా జరుపుకొనే సందర్భంలో మన హృదయాలు ఆయన యొక్క సర్వవ్యాప్త పరమానందపు సాన్నిధ్యాన్ని అనుభూతి చెందుతూ పారవశ్యంతో పులకరించి పోవుగాక.
ఎవరి జీవితం మరియు బోధనలు సర్వకాలాల్లోనూ ఆత్మసాక్షాత్కార సాధనకు సజీవ మార్గదర్శకాలుగా ఉపకరిస్తాయో, ఆ శ్రీకృష్ణునితో తనకున్న గాఢమైన వ్యక్తిగత అనుబంధాన్ని గౌరవనీయులైన మన గురుదేవులు పరమహంస యోగానందగారు మనతో పంచుకొన్నారు. గురుదేవులు రచించిన గాడ్ టాక్స్ విత్ అర్జున: ద భగవద్గీత లో శ్రీకృష్ణుడిని సర్వోత్కృష్టుడైన యోగాచార్యునిగా — ధర్మం మరియు శాశ్వత విజ్ఞానమైన క్రియాయోగం యొక్క పునరుద్ధారకునిగానూ — మన ఆత్మీయ దివ్యనేస్తంగానూ మనలో భావన కలిగేలా మన గురుదేవులు ఆ రచనను నడిపిస్తారు. గీతలోని ఉత్కృష్ట సత్యాలు ఈ సమస్త విశ్వానికి సంబంధించిన విజ్ఞానాన్ని తమలో నింపి మనకందించేటంత విశాలమైనవని గురువుగారు చూపారు; అయినప్పటికీ లక్షలాది భక్తులకు కృష్ణుడి బోధలు వ్యక్తిగత మార్గదర్శకత్వాన్ని ప్రసాదిస్తాయి. వాటి ద్వారా వారు పరమాత్ముడి ఆత్మీయ సాన్నిధ్యాన్ని, ప్రేమపూరిత రక్షణను అనుభవిస్తుంటారు.
మన రోజువారీ జీవితాలు మనలోని ఉన్నత ఆత్మకు చెందిన ధార్మిక సూత్రాలు — మంచితనం, కరుణ, నిజాయితీ, దైవంతో అనుసంధానం — మరియు అహంకార స్వభావానికి చెందిన భౌతిక వాంఛలు, ధ్యానం చేయడం పట్ల అనిష్టత, హ్రస్వదృష్టితో ఉండే స్వార్థం వీటన్నిటిని మన ముందుంచి ఏది కావాలో ఎంపిక చేసుకోమని కోరతాయి. శ్రీకృష్ణుడి “అలౌకిక గీతం” ను మన హృదయాలలో ఆలకించడం ద్వారా, తొందరపాటుతో స్వార్థానికి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకొనేలా మనను ప్రేరేపించే ఈనాటి ఉరుకుల పరుగుల ప్రపంచానికి మించిన ఉన్నత వాస్తవంలో మనం జీవించ గలుగుతాము. మనం ఆంతరికంగా నిత్యం చేసే పోరాటాన్ని భగవంతుడు కరుణతో లెక్కిస్తూ, మనం ధైర్యంతో స్వార్థరహితంగా చేసే ప్రతీ ప్రయత్నాన్నీ తన సమున్నత దీవెనలతో మరింత బలోపేతం చేస్తాడు.
ఈశ్వరుడే జతగా విచక్షణతో చేసే ఆధ్యాత్మిక కార్యకలాపం విముక్తి కారకమూ, మరింత శక్తివంతమూను. కురుక్షేత్ర యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడు తన శిష్యుడైన అర్జునునికి తన మొత్తం నారాయణ సేన ఒకవైపు, రథసారథిగా తాను ఒకవైపు ఈ రెండిటి మధ్య ఏదికావాలో ఎన్నుకోమని కోరాడు. అర్జునుని లాగానే మీరు కూడా ఈశ్వరుడిని — ఆయన యొక్క స్వచ్ఛమైన ప్రసార వాహకమైన గురువును — ఎన్నుకోవడమంటే విజయాన్ని ఎన్నుకోవడమే అని తెలుసుకోవాలి.
జన్మాష్టమి నాడు, మొత్తం ఏడాది పొడవునా కూడా శ్రీకృష్ణుడి రాజయోగం బోధించే — జ్ఞానం, భక్తి, సత్కర్మ, దైవానుసంధానాన్నిచ్చే ధ్యానం — మార్గాన్ని సంతోషంతో అనుసరించడమే మనం ఆయన పట్ల నిజంగా చూపగలిగిన గౌరవం. అలా మీరు చేస్తుంటే మీరు మీ చైతన్యాన్ని విజయవంతంగా ఉన్నతస్థాయికి లేవనెత్తగలుగుతారు, మరియు ప్రపంచాన్ని సామరస్యతతో ప్రభావితం చేయగల దైవప్రేమ, సౌందర్యం, ఆనందాలను వెదజల్లగలుగుతారు. మీలో ప్రతి ఒక్కరి కోసం నా ప్రార్థన ఇదే.
జై శ్రీకృష్ణ ! జై గురు!
స్వామి చిదానందగిరి