పరమహంస యోగానందగారి ప్రసంగాలు మరియు రచనల నుండి…
దేవుడు మానవ హృదయాల ద్వారా దాగుడు మూతలు ఆడుతున్నాడు, తద్ద్వారా మీరు మీ మానవ ప్రేమలలో కోరుకొంటున్నది ఆయన ప్రేమే అని చివరికి మీరు అర్థం చేసుకుంటారు. మీరు మీ మానవ ప్రేమల నుండి దేవుణ్ణి తొలగిస్తే, ప్రేమ మసకబారుతుంది. కాని మీ దైనందిన జీవితంలోకి దేవుణ్ణి తీసుకురావడం ద్వారా, సాధారణ మానవ ప్రేమ దివ్యప్రేమగా మారుతుంది, మీలోని దేవుని స్వరూపం నుండి ఆ దివ్యప్రేమ వ్యక్తమవుతుంది.
సకల మానవులను, ఇతర జీవులను వ్యక్తిగతంగాను మరియు ప్రత్యేకంగాను తెలుసుకొని ప్రేమించనవసరం లేదు. చేయవలసినదేమిటంటే, మీరు కలుసుకొనే జీవులన్నిటిపై స్నేహపూర్వక సేవ యొక్క కాంతిని ప్రసరింపజేయడానికి మీరు అన్ని సమయాలలో సిద్ధంగా ఉండవలసి ఉంటుంది. ఈ వైఖరికి స్థిరమైన మానసిక కృషి మరియు సంసిద్ధత అవసరం; మరో మాటలో చెప్పాలంటే, నిస్వార్థంగా ఉండాలి.
సంబంధ బాంధవ్యాల ఆధ్యాత్మిక ఉద్దేశ్యాన్ని మనం అర్థం చేసుకుంటే — ఇతరుల పట్ల ప్రేమ యొక్క నిత్య విస్తృత వలయాలలో స్వీయ-ప్రేమ విస్తారతను నేర్పించడం — అప్పుడు స్నేహం, దాంపత్య వాత్సల్యం, తల్లిదండ్రుల ప్రేమ, సాటి జీవుల ప్రేమ మరియు సజీవమైన ప్రాణులన్నిటి ప్రేమ ద్వారాల గుండా మనం సర్వశక్తిమంతమైన అలౌకిక లేక దివ్యప్రేమ రాజ్యంలోకి ప్రవేశించవచ్చు.
దేవుని ప్రేమతో ఏకమయ్యే వరకు ఏ ప్రేమ కూడా నిజమైన ప్రేమ కాదు; ఎందుకంటే నిజమైన ప్రేమ అంతా దేవుని నుండి మాత్రమే వస్తుంది. మానవ ప్రేమ, దివ్యంగా ఉండాలంటే, అది గాఢంగా మరియు నిస్వార్థంగా ఉండాలి. హృదయంలోని ప్రేమ పవిత్రమయ్యే వరకు దానిని శుద్ధి చేయండి.
సాధన చేయడానికి ఒక దివ్య సంకల్పం: “నేను ఇతరులకు ప్రేమను, సద్భావనను ప్రసరింపజేయడం ద్వారా, దివ్యప్రేమ నా వద్దకు వచ్చేందుకు మార్గాన్ని సుగమం చేస్తాను. దివ్యప్రేమ అనే అయస్కాంతం శ్రేష్ఠమైన వాటిని నా వద్దకు ఆకర్షిస్తుంది.”
పరమహంసగారు వివరించిన దివ్యప్రేమ యొక్క స్వభావం గురించి, మీ జీవితంలో దానిని ఎలా అనుభవించాలి, ఎలా వ్యక్తీకరించాలి అనే విషయం గురించి మరింత లోతైన ప్రేరణను మరియు మార్గదర్శకత్వాన్ని దిగువ ఇవ్వబడిన లింక్ లో మీరు పొందుతారు.