కేవలం గురుశిష్య సంబంధం ద్వారానే మానవ ఆత్మలు, వచ్చిన మార్గంలో తిరిగి దేవుని వద్దకు చేరగలవు, ఎందుకంటే అంతిమ మోక్షం మూడు విషయాల మీద ఆధారపడుతుంది: శిష్యుని ప్రయత్నం, గురువు సహాయం మరియు దైవానుగ్రహం…. గురువు సహాయం అత్యంత ప్రధానమైనది, ఎందుకంటే సాధకుడిని సంశయం బాధిస్తున్నప్పుడు లేక అతడి ఆధ్యాత్మిక సంకల్పం బలహీనంగా ఉన్నప్పుడు తన గురువును గాఢంగా ప్రార్థిస్తే, దైవ సాధనమైన ఆ గురువు అతడిని అనుగ్రహించి దారి చూపుతాడు.
— శ్రీ శ్రీ పరమహంస యోగానంద
ప్రియతములారా,
ఒకరు తమ సద్గురువు — భక్తుడిని సంపూర్ణ ఆత్మ విముక్తి వైపు నడిపించడానికి ఎంపిక చేసిన స్వచ్ఛమైన సాధనం — పట్ల తమకు గల గాఢమైన కృతజ్ఞత, ప్రేమ, విధేయత సమర్పణ చేయడానికి ఉన్న ఒక పవిత్రమైన సందర్భం గురుపూర్ణిమ. మనకే స్వంతమైన ప్రియతమ గురుదేవులుగా పరమహంస యోగానందగారిని, ఆయనలో సమస్తాన్నీ అక్కున చేర్చుకొని, నిరంతర ప్రోత్సాహాన్నందించే భగవంతుడి స్వరూపమైన ప్రేమను పొందడం, మన మహద్భాగ్యం.
గురువు యొక్క జ్ఞాన పూర్ణ ఉపదేశం మరియు ఆయనందించే శాశ్వత మైత్రితో అనుశ్రుతిలో ఉన్నవారికి జీవితంలో ఎదురయ్యే ఎటువంటి ఆటంకాన్నయినా ఎదుర్కోగల శక్తి ఏమిటంటే గురువు యొక్క తిరుగులేని సహాయమూ అయన ఆశీర్వాదమూ, అని మహర్షులు మనకు హామీ ఇచ్చారు. తరచూ కష్టాలు, వ్యాకులతతో నిండి ఉండే ఈ ప్రపంచంలో మనం ప్రయాణించేటప్పుడు మనం గురుదేవులను మళ్ళీ మళ్ళీ పిలవడం — మన హృదయాలూ మనస్సులూ ప్రేమతో కూడిన విధేయత మరియు వినయంతో ఆయనకు సమర్పిస్తూ — మర్చిపోకుండా ఉంటే, నిస్సందేహంగా మనకు అవసరమైన దైవ సహాయమూ గ్రహణశక్తీ లభ్యమవుతాయి. ఆయన ప్రసాదించే శాశ్వత రక్షణలో మనం ఆశ్రయం పొంది ఉంటే మనం ఎదుర్కొని దాటలేని సవాలు ఉండదు.
గురుదేవుల ప్రియతములైన మీరు ఆయన యొక్క దివ్య చైతన్యంతో మీ అనుసంధానాన్ని గాఢతరం చేసుకోవాలన్న మీ దృఢ సంకల్పాన్ని పునరుద్ధరించుకోవాలన్నది మీ కొరకు మా ప్రార్థన. మీరు ఆయన యొక్క పవిత్ర క్రియాయోగ బోధనలను అనుసరించడానికి మిమ్మల్ని మీరు సమర్పించుకొనేటప్పుడు మీ చైతన్యం పరిశుద్ధపరచబడి, పరివర్తనం చెందుతుందని తెలుసుకోండి; ఇంకా ఆయన మిమ్మల్ని అంతకంతకూ మీ మోక్షానికి దగ్గరగా — పరమాత్మతో ఏకత్వం వైపు — నడిపిస్తున్నారని తెలుసుకోండి.
భగవంతుడు, గురుదేవుల ప్రేమతో మరియు నిరంతర ఆశీస్సులతో,
స్వామి చిదానంద గిరి