దివ్యప్రేమ గురించి పరమహంస యోగానందగారు

27 ఫిబ్రవరి, 2024

దివ్య-ప్రేమ-గురించి-పరమహంస-యోగానంద

దివ్యప్రేమను లేశ మాత్రంగానైనా మీరు అనుభవిస్తే, మీరు పొందే ఆనందం ఎంత అధికంగా — ఎంత ప్రబలంగా — ఉంటుందంటే దాన్ని మీరు ఇముడ్చుకోలేరు.

మీరు పొందగల సర్వోత్కృష్టమైన ప్రేమ ధ్యానంలో భగవంతునితో సంయోగం వల్లనే కలుగుతుంది. ఆత్మకు పరమాత్మకు మధ్య ప్రేమే పరిపూర్ణమయిన ప్రేమ. అదే మీరందరూ అన్వేషిస్తున్న ప్రేమ. మీరు ధ్యానం చేస్తున్న కొద్దీ, ప్రేమ పెరుగుతుంది. లక్షలకొద్దీ పులకరింతలు మీ హృదయంలో కలుగుతాయి…మీరు గాఢంగా ధ్యానం చేస్తే, ఏ మానవమాత్రుడూ వర్ణించలేని ప్రేమ మిమ్మల్ని ఆవరిస్తుంది; భగవంతుడి దివ్యప్రేమను మీరు తెలుసుకొంటారు, ఆ నిర్మలమైన ప్రేమని ఇతరులకు ఇవ్వగలుగుతారు.

మా గురుదేవులు [స్వామి శ్రీయుక్తేశ్వర్] నన్నిలా అడగడం నాకు గుర్తుంది, ‘నువ్వు అందరినీ సమానంగా ప్రేమిస్తున్నావా?’ నేను అన్నాను, ‘అవును.’ కాని ఆయన అన్నారు ‘ఇంకా లేదు, ఇంకా లేదు.’ అప్పుడు మా ఆఖరి తమ్ముడు రాంచీలోని నా స్కూల్లో చదువుకోవడానికి వచ్చాడు. అతడు నా వాడనే భావన నాకు ఉండేది. మా గురుదేవులు ‘ఇంకా లేదు’ అని ఎందుకన్నారో అప్పుడు నేను గ్రహించాను. క్రమంగా ఆ భావన పోయింది, నేను ప్రేమిస్తున్న మొత్తం మానవాళిలో మా తమ్ముడు కూడా ఒక భాగమని నేను గ్రహించాను….ఒక రోజు గురుదేవులు మళ్ళీ నన్నిలా అడిగారు, ‘ప్రపంచాన్నంతటినీ ప్రేమిస్తున్నావా?’ నేను ఇంత మాత్రమే చెప్పాను, ‘నేను ప్రేమిస్తున్నాను.’ ఆయన నవ్వి ఇలా అన్నారు, ‘నీ పని పూర్తయింది.’

భగవత్ప్రేమ, పరమాత్మపై ప్రేమ, అన్నిటినీ దహించి తనలో ఐక్యం చేసుకొంటుంది. అది ఒక్కసారి అనుభవమైతే మిమ్మల్ని అనంత తీరాలలో ఇంకా ఇంకా ముందుకు తీసుకొనిపోతుంది. అది హృదయంలో నుండి ఎన్నడూ తొలగిపోదు. అది అక్కడ మండుతూనే ఉంటుంది, దాని జ్యోతిలో పరమాత్మ యొక్క మహత్తరమైన ఆకర్షణ శక్తిని మీరు కనుగొంటారు; అది ఇతరులను మీ వద్దకు ఆకర్షిస్తుంది, ఇంకా మీకు నిజంగా అవసరమైన దానిని లేదా కోరుకునే దానిని మీ వద్దకు ఆకర్షిస్తుంది.

ఇది గురుంచుకో: నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళినప్పుడు ప్రేమ మాత్రమే నా స్థానాన్ని భర్తీ చెయ్యగలదు. భగవంతుడిమీది ప్రేమతో రేయింబగళ్ళు నీకు అది తప్ప నీకింకేదీ తెలియనంతగా నువ్వు మత్తులో ఉండాలి. ఆ ప్రేమను అందరికీ పంచు.

—తమ శరీరాన్ని త్యజించడానికి కొద్దికాలం ముందు శ్రీ దయామాత (ఎస్.ఆర్.ఎఫ్. మూడవ అధ్యక్షురాలు) తో పరమహంస యోగానందగారు

ఈ అంశంపై పరమహంస యోగానందగారి నుండి మరింత ప్రేరణను మన వెబ్‌సైట్‌లోని “జ్ఞానంతో జీవించడం ఎలా” విభాగంలో, “ప్రేమ:మానవ ప్రేమ మరియు దివ్యప్రేమ” అనే పేజీలో కనుగొనవచ్చు.

ఇతరులతో పంచుకోండి