క్రియాయోగ మీ మెదడు కణజాలాన్ని మార్చివేస్తుంది

(శ్రీ పరమహంస యోగానందగారి ప్రసంగాలు మరియు రచనల నుండి)

మీ చెడ్డ అలవాట్లే మీ ప్రధాన శత్రువులు. మీరు వాటిని అధిగమించే వరకు అవి మిమ్మల్ని ఒక జన్మనుండి మరొక జన్మకి అనుసరిస్తాయి. విధి నుండి విముక్తమవ్వడానికి, మీ చెడు అలవాట్లను మీరు నయం చేసుకోవాలి. ఎలా? సత్ సాంగత్యం అనేది అత్యుత్తమ ఔషధాల్లో ఒకటి. మీకు మద్యపానం చేసే ధోరణి ఉంటే, తాగని వ్యక్తులతో చేరండి. ఒకవేళ మీరు అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే, అనారోగ్యం గురించి ఆలోచించని సానుకూల మనస్సు కలిగిన వ్యక్తులతో ఉండండి. మీకు వైఫల్యం అనే చైతన్యం ఉంటే, విజయం అనే చైతన్యం కలవారితో సహవాసం చేయండి. అప్పుడు మీరు మారడం ప్రారంభిస్తారు.

మీ ప్రతీ అలవాటు మెదడులో ఒక నిర్దిష్ట “గాడిని” లేదా మార్గాన్ని సృష్టిస్తుంది. ఈ నమూనాలు మిమ్మల్ని ఒక నిర్దిష్ట రీతిలో, తరచూ మీ ఆశించినదానికి వ్యతిరేకంగా ప్రవర్తించేలా చేస్తాయి. మీ జీవితం, మీ మెదడులో సృష్టించబడిన ఆ గాడులనే అనుసరిస్తుంది. ఆ కోణంలో మీరు స్వేచ్ఛాజీవి కాదు; మీరు ఏర్పరచుకున్న అలవాట్లకు కొంచెం ఎక్కువగానో, తక్కువగానో మీరే బాధితులు. ఆ నమూనాలు ఎంతలా నాటబడ్డాయనే దానిపై ఆధారపడి, ఆ స్థాయిలో మీరు ఒక కీలుబొమ్మ. కానీ మీరు ఆ చెడు అలవాట్ల ఆదేశాలను తటస్థీకరించవచ్చు. ఎలా? మంచి అలవాట్లనే వ్యతిరేక నమూనాలను మెదడులో సృష్టించడం ద్వారా. మరియు మీరు ధ్యానం ద్వారా చెడు అలవాట్ల యొక్క గాడులను పూర్తిగా చెరిపివేయవచ్చు. వేరే మార్గం లేదు. అయితే, మంచి సాంగత్యం, మంచి వాతావరణం లేకుండా మీరు మంచి అలవాట్లను పెంపొందించుకోలేరు. అలాగే మంచి సాంగత్యం, ధ్యానం లేకుండా మీ చెడు అలవాట్ల నుండి మీరు విముక్తులుకాలేరు.

పారా-ఆభరణం

మనిషి మెదడుపై ధ్యానం యొక్క ప్రభావాన్ని చూపే ఫోటో.మీరు భగవంతుడిని గాఢంగా ధ్యానించిన ప్రతిసారీ, మీ మెదడు యొక్క గాడులలో ప్రయోజనకరమైన మార్పులు చోటు చేసుకుంటాయి. మీరొక ఆర్థిక విఫలురు లేదా నైతిక విఫలురు లేదా ఆధ్యాత్మిక విఫలురు అనుకో౦డి. గాఢమైన ధ్యాన౦ ద్వారా, “నేను నా త౦డ్రీ ఒక్కటే” అని ధృవీకరి౦చడ౦ ద్వారా, మీరు దేవుని బిడ్డలని గ్రహిస్తారు. ఆ ఆదర్శాన్ని పట్టుకోండి. గొప్ప ఆనందాన్ని అనుభూతి చెందేవరకు మీరు ధ్యానం చేయండి. ఆనందం మీ హృదయాన్ని తాకినప్పుడు, మీ ప్రార్థనకు భగవంతుడు జవాబిచ్చినట్లే; మీ ప్రార్థనలకు మరియు సానుకూల ఆలోచనలకు ఆయన ప్రతిస్పందిస్తున్నాడు. ఇది ఒక ప్రత్యేకమైన మరియు ఖచ్చితమైన పద్ధతి:
ముందుగా, “నేను నా త౦డ్రి ఒకటే” అనే ఆలోచనపై ధ్యాని౦చ౦డి, గొప్ప శా౦తిని పొందడానికి ప్రయత్నిస్తూ, ఆపై మీ హృదయ౦లో గొప్ప ఆన౦దాన్ని అనుభూతి చెందండి. ఆ ఆనందం కల్గినప్పుడు, “తండ్రీ, నువ్వు నాతోనే ఉన్నావు. తప్పుడు అలవాట్లు మరియు గత బీజ ధోరణుల నుండి నా మెదడు కణాలను దహించి వేయమని, నాలోని నీ శక్తిని నేను ఆదేశిస్తున్నాను.” ధ్యానంలోని భగవంతుని శక్తి దాన్ని నెరవేరుస్తుంది. మీరు పురుషుడు లేదా స్త్రీ అనే పరిమిత చైతన్యం నుండి బయట పడండి; మీరు దేవుని సంతానమని తెలుసుకోండి. అప్పుడు మానసికంగా ధృడంగా దేవునికి ఇలా ప్రార్థించండి: “నా మెదడు కణజాలమును మార్చమని, తోలుబొమ్మను చేసిన నా చెడు అలవాట్ల యొక్క గాడులను నాశనం చేయమని ఆదేశిస్తున్నాను. ప్రభూ, వాటిని నీ దివ్యకాంతిలో భస్మం చేయుము.” మరియు మీరు ధ్యానం యొక్క ఆత్మసాక్షాత్కార పద్ధతులను, ముఖ్యంగా క్రియాయోగాన్ని అభ్యసించినప్పుడు, భగవంతుని కాంతి మీకు జ్ఞానస్నానం చేయించడాన్ని (బాప్తిజం) మీరు ప్రత్యక్షముగా దర్శిస్తారు.

పారా-ఆభరణం

ఈ ప్రక్రియ యొక్క ప్రభావం గురించి నేను మీకు ఒక యదార్థ కథను చెబుతాను. భారతదేశంలో, ఉగ్ర స్వభావమున్న ఒక వ్యక్తి నా వద్దకు వచ్చాడు. అతను నిగ్రహాన్ని కోల్పోయినప్పుడు తన యజమానులను చెంపదెబ్బ కొట్టడంలో సిద్దహస్తుడు, కనుక అతను ఒకదాని తరువాత ఒకటి అనేక ఉద్యోగాలు కోల్పోయాడు. నియంత్రించుకోలేని తన కోపంతో, తనకు ఇబ్బంది కలిగించే వారిపై చేతికందిన దాన్ని విసిరేసేవాడు. అతను నా సహాయం కోసం అడిగాడు. నేను అతనితో ఇలా చెప్పాను, “ఈ సారి మీకు కోపం వచ్చినప్పుడు, మీరు ప్రతిస్పందించడానికి ముందు వంద వరకు లెక్కించండి.” అతను అలా ప్రయత్నించాడు, కానీ నా వద్దకు తిరిగి వచ్చి, “నేను అలా చేసినప్పుడు నాకు మరింత కోపం వస్తోంది. నేను లెక్కిస్తున్నప్పుడు, అంతసేపు వేచి ఉండాల్సి వచ్చినందుకు నేను కోపంతో గుడ్డివాడినవుతున్నాను.” అతని స్థితి నిరాశాజనకంగా కనిపించింది.

అప్పుడు నేను అతనికి ఈ తదుపరి సూచనతో క్రియాయోగమును అభ్యసించమని చెప్పాను: “మీరు క్రియను అభ్యసించిన తరువాత, దివ్యకాంతి మీ మెదడులోకి వెళుతోందని, దానిని స్వాంతనపరచి, మీ నరాలను ఉపశమింపజేసి, మీ భావోద్వేగాలను శాంతపరచి, కోపాన్ని తుడిచివేస్తుందని భావించండి. ఏదో ఒక రోజు మీ కోపతాపాలు పోతాయి.” ఆ తర్వాత కొ౦తకాలానికి అతను మళ్ళీ నా దగ్గరికి వచ్చి, ఈసారి ఇలా అన్నాడు, “నేను కోప౦ అనే అలవాటు ను౦డి విముక్తుణ్ణయ్యాను. నేను చాలా కృతజ్ఞుడను.”

నేను అతనిని పరీక్షించాలని నిర్ణయించుకున్నాను. అతనితో గొడవ పెట్టుకోవడానికి నేను కొంతమంది అబ్బాయిలను ఏర్పాటు చేశాను. అతను క్రమం తప్పకుండా వెళ్ళే మార్గంలో ఉన్న తోటలో దాక్కున్నాను, ఆ విధంగా నేను గమనించసాగాను. కుర్రాళ్ళు అతనితో గొడవకు దిగడానికి పదేపదే ప్రయత్నించారు, కాని అతను ప్రతిస్పందించలేదు. అతను తన ప్రశాంతతను కాపాడుకున్నాడు.

ఇతరులతో పంచుకోండి