“ఆత్మపరిశీలన — ఆధ్యాత్మిక అభివృద్ధికి అద్భుత సాధనం” గురించి స్వామి చిదానంద గిరి గారు

యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ అధ్యక్షులు మరియు ఆధ్యాత్మిక నాయకులు అయిన స్వామి చిదానంద గిరి గారి “ది భగవద్గీత: మాస్టర్ఫుల్ గైడ్ ఫర్ ఎవిరిడే స్పిరిట్యువల్ లివింగ్” అనే ప్రసంగం నుండి సంగ్రహించబడినది.

భారతదేశపు ఉత్కృష్ట యోగ గ్రంథమయిన భగవద్గీత యొక్క మొదటి శ్లోకంలో, ఆత్మపరిశీలన అనే గొప్ప ప్రాముఖ్యతగల అంశం మనకు తారస పడుతుంది.

ఆ శ్లోకం ఇలా ప్రారంభమవుతుంది, “కురుక్షేత్రము యొక్క యుద్ధభూమిలో సమావేశమైన,” — కౌరవుల యొక్క దుష్ట శక్తులు (అహంకారానికి ప్రాతినిధ్యం) మరియు పాండవుల యొక్క మంచి శక్తులు (ఆత్మకు ప్రాతినిధ్యం), ఒకరినొకరు ఎదుర్కొంటూ — “వారు ఈ రోజు ఏమి చేశారు?” ఈ రోజు యుద్ధంలో ఎవరు గెలిచారు? గీతపై తన అద్భుత వ్యాఖ్యానమైన గాడ్ టాక్స్ విత్ అర్జున లో, యోగానందగారు ఆత్మపరిశీలన శాస్త్రం గురించి చాలా సమగ్రమైన, అందమైన వివరణనిచ్చారు.

మనల్ని మార్చుకోవడానికి ఆత్మపరిశీలన అనేది ఒక అద్భుతమైన సాధనం. ప్రతి రోజూ చివరిలో, ఆ రోజు జరిగిన సంఘటనలను నిశ్శబ్దంగా కూర్చొని సమీక్షించుకోండి — మనము ఎలా ప్రతిస్పందించాము, మనము ఎలా సమాధానమిచ్చాము, అంతకంటే మెరుగ్గా ఎలా చేయగలము, విభిన్నమైన మన ప్రతిస్పందనల నుండి, మనకు కలిగిన అనుభవాల నుండి మనం నేర్చుకున్నదేమిటి — అభివృద్ధికి ఇది ఒక అద్భుతమైన సాధనం.

కాని కొంతమందికి మాత్రమే ఇది ఎందుకు పని చేస్తుంది, మరికొందరికి ఎందుకు కఠినంగా అనిపిస్తోంది? మీరెప్పుడైనా దాని గురించి ఆలోచించారా? దీనిని మీరు పరమహంసగారు అభివర్ణించినట్లుగా, జీవిత రణరంగంలో “విజయవంతమైన మానసిక యుద్ధ” సాధనంగా కనుగొనలేకపోయారా?

దానికి కారణం నిజంగా చాలా సాధారణమైన విషయమేనని నేను భావిస్తున్నాను, అది మనం ఆత్మపరిశీలన చేసే వైఖరి నుండి వస్తుంది.

ఒక వైపున, మనలో కొందరు దీనిని మనల్ని మనం వేరుచేసుకొనే విధంగా ఉపయోగిస్తున్నారు — ప్రతి చిన్న లోపాన్ని కనుగొని, “ఓహ్, నేను ఎంత భయంకరంగా ఉన్నాను! నేను ఇంత అసంబద్ధంగా ఎలా ఉన్నాను?” మొదలైనవి అంటూ ఉంటారు. దీనివల్ల ఆత్మపరిశీలన యొక్క ముఖ్య ఉద్దేశమును పూర్తిగా కోల్పోతాం. మనం ఆత్మపరిశీలన చేసుకొనే వైఖరి అదే అయితే, దాని నుండి ప్రయోజనం పొందకుండా మనము దానిని అటక మీద పెట్టాలనుకుంటున్నామని చెప్పడంలో ఆశ్చర్యం లేదు.

కాని మరోవైపు, కొందరు తమ చర్యలు, వైఖరులు, అలవాట్లు — మరియు తమ జీవిత గమనాన్ని — మనందరిలో ఉన్న దైవ సామర్థ్యపు దృష్టికోణం నుండి చూసి ఇలా అంటారు: “ఈ సామర్థ్యాన్ని బయటకు తీసుకురావడానికి నేనేమి చేయగలను? నాలో ఉన్న అడ్డంకులను తొలగించుకోవడం ద్వారా నేను ఆ గొప్ప ఆనందం, ఆ గొప్ప ప్రేమ, ఆ గొప్ప జ్ఞానం, ఆ గొప్ప భద్రత మరియు శాంతి యొక్క గొప్ప భావనలో జీవించడానికి నేనేమి చేయగలను?” అటువంటి విధానం మన ఆత్మపరిశీలన యొక్క పద్ధతిని పూర్తిగా మర్చివేస్తుంది.

కాబట్టి ఈ ఆత్మపరిశీలన అనే కళను ఉపయోగించడం కోసం నేను ఒక సలహా ఇస్తాను: ఇది సంక్లిష్టంగా ఉండవలసిన అవసరం లేదు. మీరు దీన్ని మీకు చాలా సాధారణమైనదిగా మరియు వ్యక్తిగతమైనదిగా చేసుకోవచ్చు.

మీ జీవితంలో మీరు సాధించడానికి ప్రయత్నిస్తున్న విషయాలను వ్రాసుకోండి — ఆధ్యాత్మికమైనవి, మానసికమైనవి, ఇంకా భౌతికమైనవి కూడా — మీ లక్ష్యాలు, మీరు పెంపొందించుకోవాలనుకుంటున్న లక్షణాలు, మీ దైనందిన జీవితంలో మీరు నిజంగా నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తున్న విషయాలు: ధ్యానం మరియు సేవా దృక్పథం, దయ, లేదా ఇతరుల పట్ల సరైన వైఖరి వంటివి.

మనలో ప్రతి ఒక్కరికీ ఇది విభిన్నంగా ఉంటుంది, కాని మనము ఒక జాబితాను తయారు చేసుకొని, దానిని రోజుకు ఒకసారి సమీక్షించుకోండి — అంతే. ఇది రహస్యమైనది కాదు; ఇది సంక్లిష్టమైనదీ కాదు.

మీరు చేయగల మరికొన్ని విషయాలు కూడా ఉన్నాయి. మీ జాబితాలోని వివిధ విషయాల గురించి పరమహంస యోగానందగారు ఏమి బోధించారో, వాటిని అధ్యయనం చేయవచ్చు; మరియు మరింత పురోగతి సాధించడానికి ఒక దివ్య సంకల్పాన్ని ప్రయత్నించవచ్చు. కాని మీరు వ్రాసిన వాటిని గుర్తుంచుకోవడానికి, రోజుకు ఒక్కసారయినా జాబితాను చూడటం తప్ప మరేమీ చేయకపోయినా, మీరు మాయతో పోరాడుతున్నట్లే — మిమ్మల్ని మీరు మెరుగు పరుచుకుంటూ మార్పు చెందుతున్నట్లే.

మీకు ఇది తెలుసా, ఒకసారి ఒకవ్యక్తి ఇలా అన్నారు: “సాధువులు అసాధారణమైన పనులు చేస్తారని కాదు, కాని అవి ఎల్లప్పుడూ అసాధారణంగానే ఉంటాయి.” మన జీవితాన్ని గడపాలనుకొనేదాని గురించి మనందరికీ ఒక భావం ఉంటుంది. ఇదే గుర్తుంచుకోవలసిన విషయం.

కాబట్టి ఆత్మపరిశీలన చేసుకోండి, దైనందిన స్వీయ-విశ్లేషణ అనే ఈ అద్భుత సాధనం, మీ మంచి అలవాట్లలో ఒకటి: సాయంత్రం ధ్యానం చేసిన తరువాత కొద్ది నిమిషాలపాటు మీ జాబితాను పరిశీలించండి. మీరు దీన్ని సరైన వైఖరితో చేసినప్పుడు, మీ లక్ష్యాలను సాధించడానికి మీ సమర్థతలో వచ్చే మార్పులను మరియు మీకు కలిగే ఆనందాన్ని చూసి మీరు నిజంగా ఆశ్చర్యపోతారు.

మీ జీవితంలో మీ లక్ష్యాలను సాధించడానికి మరియు ఎక్కువ ఆనందాన్ని, విజయాన్ని — ఆధ్యాత్మికంగానూ భౌతికంగానూ — పొందడానికి ఆత్మపరిశీలన అనే సాధనాన్ని ఎలా ఉపయోగించుకోవాలనే కీలకమైన అంశంమీద మీ పూర్తి అవగాహన కోసం కొన్ని అదనపు వనరులను సూచిస్తున్నాము:

  • “ఇంట్రాస్పెక్షన్ — ఎక్స్ప్లోరింగ్ ద వర్కింగ్స్ ఆఫ్ యువర్ ఇన్నర్ సెల్ఫ్,” అనే అంశం మీద 2021 ఎస్.ఆర్.ఎఫ్. ప్రపంచ స్నాతకోత్సవంలో స్వామి ఇష్టానంద గిరి చేసిన ఆంగ్ల ప్రసంగం — వీడియో
  • “ఇంట్రాస్పెక్షన్ — కీ టు సెల్ఫ్-డిస్కవరీ,” అనే అంశం మీద ఎస్.ఆర్.ఎఫ్ వారాంతపు ఆన్‌లైన్ స్ఫూర్తిదాయక సత్సంగాల క్రమం నుండి సేకరించిన స్వామి గోవిందానంద గిరి 2021లో ఇచ్చిన ఆంగ్ల ప్రసంగం – వీడియో
  • అనుబంధ పాఠం 69, “ఆత్మపరిశీలన మరియు మానసిక స్వీయ-విశ్లేషణ అనే కళ” — యోగదా సత్సంగ పాఠాల (ధ్యానం మరియు ఆధ్యాత్మిక జీవనం మీద పరమహంస యోగానందగారి గృహ అధ్యయన పాఠాల) విద్యార్థుల కోసం

ఇతరులతో పంచుకోండి